కని పెంచిన తల్లితండ్రులపై కరుణ లేని కన్న బిడ్డలతో నిండిన కలికాలం. కడుపు తీపిని చంపుకోలేక, కనీస అవసరాలను తీర్చే దిక్కు లేక,
“కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని” కనికరం లేని కన్న బిడ్డల తప్పులను కడుపులోనే దాచుకొని, తమ కన్నీరును కంటి రెప్పను
దాటనివ్వక, కాలం గడుపుతున్న అసహాయ జీవులు తల్లితండ్రులు.
ఎంతసేపు తమకు ఏమి చేసారు అని ప్రశ్నించే బిడ్డలు తప్ప, తాము తమ తల్లితండ్రులకు ఏమి చేసాము, ఏమి చేయాలి అని, కనీసం ఒక్క క్షణం ఆలోచించే బిడ్డలు కనిపించరే?
కళ్ళల్లో పెట్టుకొని పెంచిన తల్లి
కడుపులో పడిన క్షణం నుండి బిడ్డలను కనేవరకు, ఒక తల్లి పడే కష్టం కనిపించదా ఈ బిడ్డలకు? తల్లి అనే పదానికి నిర్వచనం త్యాగం అంటే అతిశయోక్తి కాదేమో! ఒక్క సారి ఆలోచించండి. తాను తినే ఆహారం దగ్గర నుంచి, తన తుది శ్వాస వరకు ఒక తల్లి పడే తపన, తన బిడ్డల కోసం చేసే త్యాగం దేనితో వెలగట్టగలము చెప్పండి?

“కు సంతానం (చెడ్డ సంతానం) ఉండ వచ్చు కాని, కు మాత (చెడ్డ తల్లి ) ఉండదని పెద్దలు చెప్తారు. ఎవరైనా దీనిని కాదన గలరా? ఒక ఆడది చెడ్డది కావచ్చు కాని, ఒక తల్లి ఏనాడు చెడ్డది కాదు.
ఏమి ఇచ్చారు? ఏమి చేసారు? అని పదే పదే ప్రశ్నించే కఠిన మైన మనస్సు, పాషాణ హృదయాన్ని కలిగిన బిడ్డలకు ఒకే సమాదానం. ఏమి ఇచ్చారు అంటే – జన్మను ఇచ్చారు! చాలదా? నాది నేను అని విర్రవీగే మీ వ్యక్తిత్వానికి తల్లితండ్రులు కాదా మూలకారకులు?
సంస్కారాన్ని ఇవ్వలేని చదువు, బంధాలు, బాంధవ్యాలను, ప్రేమానురాగాలను వెలగట్టే ఇంగిత జ్ఞ్యనాన్ని ఇవ్వలేని నాగరికత ఎందుకండీ?
కంటికి రెప్పగా కాపాడిన నాన్న
తన సుఖాన్ని తన సంతోషాలని మరచి, తన సంతానాని కోసం నిరంతరం కృషి చేసేవాడే తండ్రి. చిన్నపుడు తన బుజాల పై మోసి ఆడించి, పెద్దయ్యే వరకు
తన బిడ్డల బాధ్యతలను గుండెల పై మోస్తూ, తన కనీస కోరికలను కూడా చంపుకొని, తమ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఆలోచించే తండ్రి భవిష్యత్తు అదోగతి
చేస్తున్న కన్న బిడ్డలను ఏమని వర్ణించాలి?

తనయుడు కావలి, తన వంశ వృక్షాన్ని పెంచాలి అని తపన పడే తండ్రికి, తన తనయుడు ఇచ్చే బహుమానం ఏమిటండి? తల కొరివి తప్పా! వృద్దాప్యంలో తమను
కనిపెట్టుకొని ఉంటారని కలలు కనే తల్లితండ్రులను కనిపెట్టుకొని ఉండరు సరి కదా, తమ పిల్లలను కనిపెట్టుకొని చూడమని తమ బాధ్యతను వారి పై రుద్ది వెళుతున్నారు బాధ్యతలేని బిడ్డలు.
కలి ప్రభావం వల్ల కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తున్న కనికరం లేని బిడ్డలున్న ఈ ప్రపంచంలో, తల్లితండ్రులకు ఒకటే మనవి. తాము తమ పిల్లలను కన్న క్షణం నుండి, పెంచి పెద్ద చేసే వరకు ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ, తాము చేయవలసిన సాధన ఏమిటంటే, భవ బంధాలను వీడటం (Sense of attachment with detachment). ఇది ఒక్క క్షణంలో కాని, ఒక్క రోజులో జరిగే పని కాదు. భవబంధాలను వీడటం అనేది ఒక సాధన. తమ అవసాన దశలో ప్రశాంతంగా తుది శ్వాస విడవటానికి దోహద పడుతుంది.
“వెయ్యి ఏళ్ళు ఉన్నా వేరు తప్పదు, వంద ఏళ్ళు ఉన్నా చావు తప్పదు” అన్నారు పెద్దలు. ఇది జీవిత సత్యం.

అందుచేత ప్రేమ మూర్తులు, జీవన దాతలు అయిన తల్లితంద్రులందరికి నా ఈ చిన్న మనవి. ఒక్కసారి సావధానంగా ఆలోచించండి. తమ జీవితాన్ని ప్రశాంత చిత్తంతో పరిపూర్ణంగా జీవించి ముక్తిని పొందాలని ఆకాంక్షిస్తూ, ఇక సెలవు.
A good message to the new generation children
Very heart touching message
Thank you!
Thanks Rajashekar!
Superb saying the perfect massage to this generation di
Thanks kapil!